ఎలీషా పాఠశాల – TVBS (తెలుగు విరామ బైబిల్ పాఠశాల)
రాబోయే తరాలు ఎలా ఉండాలి? ఆయా తరాలలో మనకు కనిపించిన శ్రేష్ఠ భక్తుల వంటివారు భవిష్యత్తు తరాల్లో ఉండాలంటే మనం ఏమి చేయాలి?. దేవుని ఎరుగని తరములు ఉండకూడదు, అలా జరిగితే అది మన బాధ్యత అవుతుంది ( న్యాయాధిపతులు 2:10).
కోల్పోయిన మహిమను మరలా తిరిగి తీసుకుని రాగలిగిన సమూయేలు, ఇబ్బందుల కొలిమిలో దేవుని మహిమను బయల్పరచిన దానియేలు వంటివారు తరానికి ఒక్కరు ఉంటే ఆ తరం ప్రభు ప్రేమను రుచిస్తుంది. ఆయన మహిమను కన్నులారా చూస్తుంది.
మరి యోసేపు వలే పరిశుద్ధతను కాపాడుకుంటూ, దేవునికి ఇష్టులుగా జీవిస్తూ, వాక్య కరువులో ఉన్న సహోదరులను ప్రశస్థ వాక్య మన్నాతో పోషించేవాళ్లు ప్రతి తరంలోనూ ఉంటే? దేవుని మనస్సు నెరిగి, ఆయన ఆవేదనను అర్ధం చేసుకుంటూ జీవించే యిర్మీయా, యెహెజ్కేలు వంటివారు. దేవుని హృదయానుసారుడైన దావీదు వంటివారు ఈ తరంలో లేవాలంటే మనం ఏమి చేయాలి?
ఈ తరంలోని తల్లిదండ్రులు, సేవకులు, సండేస్కూలు టీచర్లు, నేటితరం పిల్లల్ని ప్రభువు చేతులకు అప్పగిస్తూ, భారము కలిగి ప్రార్థిస్తే, ఆదికాండం 18:19 ప్రకారం దేవుడు మనలను గురించి సాక్ష్యమిస్తాడు. అప్పుడు. రాబోయే తరం దేవునికి మహిమకరమైన తరంగా ఉంటుంది.
పిల్లల పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులనుగా ఉండుట కొరకు మీకు హృదయపూర్వక స్వాగతం. ప్రభువు అనుగ్రహించిన ప్రేరణను బట్టి ఎంతో కాలంగా ప్రార్ధిస్తూ, వాక్య ప్రమాణాల ఆధారంగా రూపుదిద్దుకున్న పరిచర్య ఇది. చిన్న వయస్సులోనే ప్రభువును అంతరంగంలో నిలుపుకుంటారనే ఆశ "ఎలీషా పాఠశాల" తెలుగు వి.బి.యస్ ఆవిర్భావానికి కారణమైంది.
మనస్తత్వ నిపుణుల విశ్లేషణ ప్రకారం “పిల్లలకు మూడు సంవత్సరముల వయస్సు నుండే మంచి, చెడుల వ్యత్యాసాన్ని గుర్తించగల సామర్ధ్యము వస్తుంది”. ఎవరికి బోధించాలి? అనే ప్రశ్నకు సమాధానము 'అందరికి'. మరి ముఖ్యముగా చిన్నబిడ్డలకు వారి బాల్యము నుండే వాక్య ప్రమాణాలతో కూడిన బోధ తప్పనిసరిగా కావాలి. 'దైవిక క్రమశిక్షణ'తో కూడిన బోధను మనపిల్లలకు అన్ని తరాలకు అందించాలి ( కీర్తన 78:1-8)
మాతో పాటు మీరూ నడుముకట్టి, రాబోయే తరం కోసం నేడు శ్రామికులుగా మారాలనే ఆశ చొప్పున సీరీస్ గా ఈ పాఠ్యాంశాలను మీముందుంచుతున్నాం, స్వీకరించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని వారికి మరియు తెలుగు సంఘాలకు ఆశిర్వాదకరంగా ఉంచినందుకు దేవునికి ధన్యవాదాలను మాతో కూడా అర్పించండి. సమస్తం చేయించిన ఆ ప్రభువునకే సమస్త మహిమ చెందును గాక! ఆమేన్!!!